తోచీతోచనమ్మ యేమీ తోచక టీవీ పెట్టుకుని వంటలు-వార్పులు ప్రోగ్రాము చూస్తుంది…చూసాక అర్థం అయింది అది వంటలు-వార్పులు కాదు,వంటలు-వాంతులు ప్రోగ్రాము అని.అందులో వంట చేసే ఆవిడ కేవలం ఆ ఒక్కరోజు కోసం యేదో ఒక వంట ప్రయోగం చేయాలని సంకల్పించుకుని వచ్చినట్లుంది..కనీ వినీ ఎరుగని రీతిలో వండిపడేసి,రుచి చూసి చెప్పండి అంది..అందులో యాంకరమ్మకి యేమి చెప్పాలో అర్థం కాక మరొక ఇద్దరికి ఆ రుచి చూపించి వాళ్ళతో ఆ వంటకం గురించి చెప్పించింది..అందరూ ముక్త కంఠంతో రుచి బాగుంది,కాని కాస్త నూనె తగ్గించాల్సింది, వేరుశెనగపొడి వేయకుండా ఉండాల్సింది,నిమ్మ రసం చివర్లో వేసి ఉంటే బాగుండేది అని సలహాలు ఇచ్చారు..దాన్ని బట్టి అర్థం అయింది,ఆ రుచి ఎంత మహత్తరంగా ఉందో…
ఆ వంటకం పేరు పనీర్ బెండి మసాల.మెయిన్ ఇంగ్రీడిఎంట్స్ పనీర్,బెండకాయ,వేరుశెనగపప్పుల పొడి,కాలిఫ్లవరు,నిమ్మరసం,ఇంకా ఉప్పు,కారం,గరం మసాల,తాలింపు గింజలు వగైరా వగైరా…నూనె మాత్రం కూర మొత్తం డీప్ ఫ్రై చేయదానికి సరిపడా….
యాంకరమ్మ అమాయకంగా అంత నూనె ఎందుకు అని అడిగింది,కూర చేయడానికి అని చెప్పింది వంట చేసే వనిత.అది కూర తాళింపా లేక,డీప్ ఫ్రై నా చివరి వరకు అర్థం కాలేదు…అర లీటర్ నూనె పోసి,అందులో తాలింపు గింజలు,చెక్కలవంగాలు,ఉల్లిపాయ ముక్కలు,పచ్చి మిర్చి ముక్కలు వేసి,వేగాక పనీర్ ముక్కలు,బెండి ముక్కలు,అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి,తర్వాత పల్లీల పొడి ,ఉప్పు,కారం,గరం మసాల పొడి,పసుపు వేసి కలపాలి,వెంటనే నిమ్మరసం ఒక కప్పు ఆ కూరలో పోయాలి.(మళ్ళీ అమాయకంగా నిమ్మరసం మధ్యలో వేస్తే చేదు కాదా,చివర్లో కదా వేయాలి అని యాంకరమ్మ అడిగింది,యేమీ కాదు అని వంటల వనిత చెప్పింది).. తర్వాత కాస్త ఖాజు ముద్ద వేయాలి..ఈ అయిటంస్ అన్నీ కూడా నూనెలొ వుడుకుతున్నాయ్..ఒక అర కప్పు పెరుగు వుడుకుతున్న కూరలో వేసింది..కాసేపు అయ్యాక కూర తయారు అయినట్లే అని,ఎండు కొబ్బరి పొడి,ధనియాల పొడి వేసి దించేసి,నూనెలో మునిగిపోయిన ఆ కూరని,ఒక గిన్నెలోకి తీసి(కాదు కాదు వడపోసి అనాలేమో)కొత్తిమీర,జీడిపప్పు తో అలంకరించింది..అదీ వంటకం..రుచి చూసిన యాంకరమ్మ,జడ్జీలు చూపించిన హావభావాలు చూసితీరాల్సిందే,నవ్వాగలేదు అంటే నమ్మండి.
తోచీతోచనమ్మ ఏమంటుంది అంటే,ఈ వంట వనితకు ఏ పదార్ధం ఎప్పుడు వాడాలో, ఎంత వాడాలో తెలియదు,అసలు అన్ని అయిటంస్ అవసరముందా అని ఆలోచించాల్సింది..అర కప్పు వేరుశనగపప్పు పొడి,అర కప్పు జీడిపప్పు ముద్ద ఒకేసారి వేయాల్సిన అవసరం లేదు..ఏదో ఒకటి వాడితే సరి,లేదా రెండూ కొంచెం కొంచెం పరిమాణం లో వాడుకోవాల్సింది.రెండు టేబుల్ స్పూనుల నూనె అయితే చాలు..అర లీటరు నూనె పోయాల్సిన పని లేదు..మసాలా కూడా అంత అవసరం లేదు..పేరుకే బెండకాయ ఉంది కాని,ఈ గ్రేవీలో ఆ బెండి,కాలిఫ్లవరు కనపడనే లేదు..టీవీ లో వచ్చే ఒకగంట వంటే అయినా చూసే వాళ్ళకు కూడా బాగుంది,ప్రయత్నిద్దాం అనిపించాలి కాని,అదొక మహా యాగం,అన్ని అయిటంస్ వేస్తే కొలెస్ట్రాల్ పెరుగుతుంది,అవసరమా అనిపించేలా ఉండకూడదు…ఒకవేళ ఇలాంటి వంట చేసినా చేసిన వాళ్ళు తినరు,ఇంట్లో వాళ్ళతోనో,పక్కవాళ్ళ చేతనో తినిపిస్తారు..
తోచీతోచనమ్మ టీవీ వాళ్ళకు ఇచ్చే సలహా అనుకోండి,రిక్వెస్ట్ అనుకోండి,అది ఏమిటి అంటే వంటల ప్రోగ్రాములలో కొత్తవాళ్ళతో వంట చేయించాలి అంటే కొంచెం ముందే వంట చేసే వాళ్ళని ప్రిపేరు చేయించండి,ఒకసారి వాళ్ళతో ఆ వంట చేయించి ,మీరు ఓకే అనుకున్నాకే వాళ్ళని రంగంలోకి దింపండి.వీలైనంత వరకు,తక్కువ అయిటంస్ వాడి మంచి మంచి వంటలు ఎలా చేయొచ్చో చూపించండి,..నా నా హంగామా వంటలు, పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసి మా మీద వదలకండి …కొన్ని సార్లు మంచి వంటలు కూడా చూపిస్తున్నారు,మేము కూడా ప్రయత్నించాం,సఫలీకృతం అయ్యాం….అందుకు ధన్యవాదములు…మీరు మరెన్నో మంచి వంటలు మాకు నేర్పించాలని ఆశిస్తూ…సెలవు.