బడుగు వర్గాలను ఉద్దరించాలనే మీ ఆశయం చాలా గొప్పది.అన్ని కులాలలోను,అన్ని మతాలలోను ఆర్థికంగా,విద్యాపరంగా వెనుకబడిన వారున్నారు.వారిని అన్నివిధాలుగా పైకి తీసుకురావాలనే మీ సంకల్పం అత్యద్భుతం.అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తించాలి సార్,లేడికి లేచిందే పరుగు అన్నట్లు గా పనులు జరగాలి,రాత్రికి రాత్రే రోం నగరం కావాలి అంటే మాత్రం అది కుదరదు..ఆకలితో ఉన్నవాడికి,ఆహారంకోసం ఎదురుచూసేవాడికి పచ్చడన్నం దొరికినా పరమాన్నం గా భావిస్తాడు.ఆకలి లేనివాడికి,వింతవింత పదార్థాలు కోరుకునే వాడికి మనం పరమాన్నం పెట్టినా పక్కకు తోసేస్తాడు.చదువుకోవాలి అని తపన ఉండి చదువుకోలేని పిల్లలకు చదువు చెప్పించండి సార్,చదువు కాకుండా వేరే ఆశయాలు ఉన్నవాళ్లకు,ఇతర ఆసక్తులు ఉన్నవాళ్లను బలవంతంగా చదివించకండి,ఒంటబట్టదు.దయచేసి అర్థం చేసుకోండి.అందరూ ఆకాశానికి ఎగిరితే భూమి మీద నిలబడెవాడు ఎవరు?నిర్బంధ విద్య చిన్నపిల్లలకు అవసరమె సార్,కాని 14 సంవత్సరాలు నిండిన బాలబాలికలకు అవసరం లేదు సార్,వారిని వారి పరిస్థితులకు తగినట్లుగా ఎదగనివ్వండి..
తినడానికి తిండి లేదు,ఆన్లైన్ తరగతులకోసం స్మార్ట్ ఫోన్ ఎలా కొనాలి అని తల్లడిల్లే తల్లితండ్రుల ఆవేదనని అర్థం చేసుకోండి సార్..
భరించగలిగిన వారు,కొనగలిగిన వారు కొని తరగతులు వింటుంటే ,మా చదువు కోసం స్మార్ట్ ఫోన్ కొనలేని తల్లితండ్రుల కడుపున ఎందుకు పుట్టామా అని అలిగి ,ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకున్న విద్యార్థుల మానసిక వ్యధని,అది చూసి తట్టుకొలేక మనోవ్యధతో కుమిలిపోయే తల్లితండ్రులని చూడండి సార్.సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా కంప్యూటర్ ముందు కూర్చుని గంటల తరబడి పని చేస్తే రకరకాల ఆరోగ్య,మానసిక సమస్యలతో సతమతం అవుతారు.అలాంటిది విద్యార్ధులు,ఉపాధ్యాలు గంటల తరబడి ఫోన్ చూస్తూ,నెట్ వర్క్ సరిగా లేక టెన్సన్ పడుతూ నెలల కొద్దీ సమయం వెచ్చిస్తే వారికొచ్చె ఆరోగ్య సమస్యలకు మీరు బాధ్యత వహిస్తారా సార్?
పబ్జి ఆట కంటె ప్రమాదకరం గా ఉంది సార్ మీ ఆన్లైన్ విద్యావిధానం.ఇంటర్నేషనల్ స్కూల్స్ తో పోల్చి విద్యనివ్వాలి అంటే అందుకు తగిన పరికరాలు విద్యార్థుల దగ్గర కూడా ఉండాలి కదా సార్.కోటీశ్వరుల పిల్లలకు మా పిల్లలకు పోలిక 'ఎంటి సార్,అంత టెక్నాలజి మా పల్లెలలో ఎక్కడిది సార్..పక్కింటివాల్ల ఫోన్ ఎన్నిరోజులు వాడుకుంటాము సార్,పిల్లలు ఈ వయసులో స్మార్ట్ ఫోన్ భవిష్యత్ కోసం ఎన్ని రకాలుగ ఉపయోగించుకోవాలో తెలుసుకుంటారో లేదొ కాని ఎన్ని రకాలుగా చెడిపోవాలో ఎవరూ చెప్పకుండానే నేర్చుకుంటారు సార్...మా బాధ అర్థం చేసుకోండి సార్,ఎందుకంటే మీరు కూడా మా లాగే ఒక తండ్రే..స్మార్ట్ ఫోన్ వలన కలిగే అనర్ధాలు మీకు తెలుసు. స్మార్ట్ ఫోన్ కొనిచ్చె స్థితిమంతులమైతే మీ హాస్టల్లొ ఎందుకు చదివిస్తాం సార్,మా పిల్లలను మీరు చెప్పే ఇంటర్నేష్నల్ స్కూల్ లోనె చదివించేవాళ్లం .చదివించడం తేలికని,అన్ని ఖర్చులు మీరు భరిస్తారని అనుకుంటే ఆ చదువు కూడా మాకు మీరు భారం గా చేసారేంటి సార్?
ఇలాంటి చదువు మా పిల్లలకు వద్దు సార్,జీవితం నేర్చుకుంటే చాలు,నేను వ్యవసాయం నేర్పిస్తాను నా బిడ్డకి!,అందరికి అన్నం పెట్టే గొప్ప చదువది. నిజంగా సమన్యాయం చేయాలనిపిస్తే విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులు ఇచ్చినట్లు ,ఫ్రీ వసతులు సమానంగా ఇచ్చినట్లు స్మార్ట్ ఫోన్ లు కూడా అందరికి ఉచితంగా పంచండి,ప్రతీనెల రీచార్జ్ చేయించండి సార్.ఒక జనరేషన్ విద్యార్థులు జీవితం అంతా మిమ్మల్ని తలచుకుంటారు.ఎందుకంటె ఎక్కడా,ఏ కాలేజి లొ లేని విధంగా,వేసవి సెలవులు,కరోనా సెలవులు అన్నిటిని కేవలం చదువుకోసమే సద్వినియోగం చేసుకొవడానికి వీలుగా స్మార్ట్ ఫోన్ ఇచ్చినందుకు.
ధన్యవాదములు