23, జూన్ 2015, మంగళవారం

ఉపవాసం

ఉపవాసం అంటే కడుపుని ఖాళీగా ఉంచడం కాదు.మనసుని ఖాళీగా ఉంచడం.ఖాళీ మనసులోకి భగవంతుని అహ్వానించడం.ఉపవాసం పేరుతో కడుపు మాడ్చుకుని,భావోద్వేగాలను అదుపు చేసుకోకుండా,నానా హైరానా పడుతూ,ఉపవాసం ఉన్నాం అని హంగామా చేయడం ఉపవాసం ఉద్ద్యేశ్యం కాదు.నోరుని,మనసుని,ఆలోచనలని అదుపుచేయని ఉపవాసం వ్యర్థం.నోరు అదుపు అంటే కేవలం తిండి విషయంలోనే కాదు,నోటితో మాట్లాడే మాటలకు కూడా వర్తిస్తుంది.ఉపవాసం ఉన్నాం,నోటికి మాత్రం ఎంత మాట వస్తే అంత మాట అనేస్తున్నాం,దానివలన ఎదుటివాళ్ళను బాధపెడుతున్నాం అనుకోండి,ఉపవాసం ఉండి ఏమైనా ప్రయోజనం ఉంటుందా?ఉపవాసం ఉండి,టీవీ చూడడం,సినిమా పాటలు వినడం,న్యూస్ పేపర్ చదవడం లాంటి పనులు చేయడం వలన ఉపవాస దీక్ష ప్రయోజనం సిద్దిస్తుందా?నేనైతే లేదనే అనుకుంటున్నాను..
మితాహారం,సాత్వికాహారం తీసుకోవడం వలన మనసు,ఆలోచనలు అదుపులో ఉంటాయ్,తద్వారా దైవచింతన అలవడుతుంది. నిత్యం మితాహారం,సాత్వికాహారం తీసుకునే వారికి,మృదుభాషులకి మళ్ళీ ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం. ఎందుకంటే వారికి మనసుని,ఆలోచనలని అదుపు చేసే శక్తి ఉంటుంది.భగవంతునికి దగ్గరగా ఉంటారు.అదే కదా ఉపవాసం ముఖ్య ఉద్ద్యేశం.


19, జూన్ 2015, శుక్రవారం

ప్రకృతిని రక్షించండి,ప్రకృతి మనల్ని రక్షిస్తుంది


ఈ రోజు విజయవాడ సమీపంలో ఆకాశం నుండి చేపల వర్షం పడిందిట..పరిసర ప్రాంతంలోని ప్రజలు వింతగా,ఆశ్చర్యంగా భావించి వీలైనన్ని చేపలని ఇళ్ళకు మూట కట్టుకెళ్ళారట.నీటిలో చేపలు,కప్పలు ఉన్నాయ్ కాబట్టి వర్షం వాటిని మోసుకొచ్చి నేలకిచ్చింది.

అదే నీటిలోగాజుముక్కలు,సీసాపెచ్చులు,సూదులు,మేకులు,ఇతరత్రా రసాయనాలు ఉంటే అవి ప్రమాదకరం అని తెలియని వర్షం వాటిని సైతం మోసుకొచ్చి నేలకిచ్చేయదూ!!..చేపలు,కప్పలు ప్రమాదకరం కాదు కాని,ఈ పారిశ్రామిక వ్యర్ధాలు ఎంత ప్రమాదమో కదా…అవి వర్షంతో పాటే కురిస్తే,సూటిగా మనుషులకు,జంతువులకు తాకితే,గుచ్చుకుంటే ఎంత భయానకం గా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది….విష పదార్ధాలు,రసాయనాలు కురిస్తే ఇంకేమైనా ఉందా..?!!అందుకే దయ చేసి నీటిలో పారిశ్రామిక వ్యర్ధాలు,చెత్తచెదారాలు వేయకండి…ప్రకృతిని రక్షించండి,ప్రకృతిని మనల్ని రక్షిస్తుంది….








18, జూన్ 2015, గురువారం

నీ ప్రేమకోసమే..

అతని ప్రేమకై కన్నవారి ప్రేమకి దూరమయ్యాను
అతని ప్రేమకై అన్నగారి ప్రేమకి దూరమయ్యాను
అతని ప్రేమకై బంధుమిత్రులకు చేదునయ్యాను
అయినా సరే
అన్ని బంధాలు,బంధుత్వాలు తానై నన్ను అల్లుకుపోతాడనుకున్నా
అతని ప్రేమకై నన్ను నేను మార్చుకున్నా
అతనే నేనై ఒదిగిపోయాను..

అన్నివేళలా అతనే నా తోడు,నేను ఆతని నీడ అని భావించాను
అన్నీ వదులుకుని అతనే చాలు అనుకున్నాను,కాని తను
ఏమీ లేనిదానివి,ఎవరూలేని దానివి నాకు వద్దు అన్నాడు
ఎవరూ లేని ఒంటరిని చేసిన అతనంటే నాకు కోపం లేదు
అన్నీ అతనే అయి నన్ను ప్రేమిస్తాడు అన్న ఆశ తప్ప..
అతని ప్రేమ చినుకు పడేవరకూ చిగురించని మ్రానుగా,
ఆ ప్రేమ స్పర్శ కోరే పసిప్రాణంగా నేను ఎదురుచూస్తూనే ఉంటాను
ఎందుకంటే అందరినీ,అన్నీ వదులుకున్నది ఆ ప్రేమ కోసమే కదా..
అన్ని బంధాలు తెంచుకున్నదీ ఈ బంధం పెనవేయడం కోసమే కదా.. 

17, జూన్ 2015, బుధవారం

వంటలు-వాంతులు


 తోచీతోచనమ్మ యేమీ తోచక టీవీ పెట్టుకుని వంటలు-వార్పులు ప్రోగ్రాము చూస్తుంది…చూసాక అర్థం అయింది అది వంటలు-వార్పులు కాదు,వంటలు-వాంతులు ప్రోగ్రాము అని.అందులో వంట చేసే ఆవిడ కేవలం ఆ ఒక్కరోజు కోసం యేదో ఒక వంట ప్రయోగం చేయాలని సంకల్పించుకుని వచ్చినట్లుంది..కనీ వినీ ఎరుగని రీతిలో వండిపడేసి,రుచి చూసి చెప్పండి అంది..అందులో యాంకరమ్మకి యేమి చెప్పాలో  అర్థం కాక మరొక ఇద్దరికి ఆ రుచి చూపించి వాళ్ళతో ఆ వంటకం గురించి చెప్పించింది..అందరూ ముక్త కంఠంతో రుచి బాగుంది,కాని కాస్త నూనె తగ్గించాల్సింది, వేరుశెనగపొడి వేయకుండా ఉండాల్సింది,నిమ్మ రసం చివర్లో వేసి ఉంటే బాగుండేది అని సలహాలు ఇచ్చారు..దాన్ని బట్టి అర్థం అయింది,ఆ రుచి ఎంత మహత్తరంగా ఉందో…
 
ఆ వంటకం పేరు పనీర్ బెండి మసాల.మెయిన్ ఇంగ్రీడిఎంట్స్ పనీర్,బెండకాయ,వేరుశెనగపప్పుల పొడి,కాలిఫ్లవరు,నిమ్మరసం,ఇంకా ఉప్పు,కారం,గరం మసాల,తాలింపు గింజలు వగైరా వగైరా…నూనె మాత్రం కూర మొత్తం డీప్ ఫ్రై చేయదానికి సరిపడా….    

యాంకరమ్మ అమాయకంగా అంత నూనె ఎందుకు అని అడిగింది,కూర చేయడానికి అని చెప్పింది వంట చేసే వనిత.అది కూర తాళింపా లేక,డీప్ ఫ్రై నా చివరి వరకు అర్థం కాలేదు…అర లీటర్ నూనె పోసి,అందులో తాలింపు గింజలు,చెక్కలవంగాలు,ఉల్లిపాయ ముక్కలు,పచ్చి మిర్చి ముక్కలు వేసి,వేగాక పనీర్ ముక్కలు,బెండి ముక్కలు,అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి,తర్వాత పల్లీల పొడి ,ఉప్పు,కారం,గరం మసాల పొడి,పసుపు వేసి కలపాలి,వెంటనే నిమ్మరసం ఒక కప్పు ఆ కూరలో పోయాలి.(మళ్ళీ అమాయకంగా నిమ్మరసం మధ్యలో వేస్తే చేదు కాదా,చివర్లో కదా వేయాలి అని యాంకరమ్మ అడిగింది,యేమీ కాదు అని వంటల వనిత చెప్పింది).. తర్వాత కాస్త ఖాజు ముద్ద వేయాలి..ఈ అయిటంస్ అన్నీ కూడా నూనెలొ వుడుకుతున్నాయ్..ఒక అర కప్పు పెరుగు వుడుకుతున్న కూరలో వేసింది..కాసేపు అయ్యాక కూర తయారు అయినట్లే అని,ఎండు కొబ్బరి పొడి,ధనియాల పొడి వేసి దించేసి,నూనెలో మునిగిపోయిన ఆ కూరని,ఒక గిన్నెలోకి తీసి(కాదు కాదు వడపోసి అనాలేమో)కొత్తిమీర,జీడిపప్పు తో అలంకరించింది..అదీ వంటకం..రుచి చూసిన యాంకరమ్మ,జడ్జీలు చూపించిన హావభావాలు చూసితీరాల్సిందే,నవ్వాగలేదు అంటే నమ్మండి.    

తోచీతోచనమ్మ ఏమంటుంది అంటే,ఈ వంట వనితకు ఏ పదార్ధం ఎప్పుడు వాడాలో, ఎంత వాడాలో తెలియదు,అసలు అన్ని అయిటంస్ అవసరముందా అని ఆలోచించాల్సింది..అర కప్పు వేరుశనగపప్పు పొడి,అర కప్పు జీడిపప్పు  ముద్ద ఒకేసారి వేయాల్సిన అవసరం లేదు..ఏదో ఒకటి వాడితే సరి,లేదా రెండూ కొంచెం కొంచెం పరిమాణం లో వాడుకోవాల్సింది.రెండు టేబుల్ స్పూనుల నూనె అయితే చాలు..అర లీటరు నూనె పోయాల్సిన పని లేదు..మసాలా కూడా అంత అవసరం లేదు..పేరుకే బెండకాయ ఉంది కాని,ఈ గ్రేవీలో ఆ బెండి,కాలిఫ్లవరు కనపడనే లేదు..టీవీ లో వచ్చే ఒకగంట వంటే అయినా చూసే వాళ్ళకు కూడా బాగుంది,ప్రయత్నిద్దాం అనిపించాలి కాని,అదొక మహా యాగం,అన్ని అయిటంస్ వేస్తే కొలెస్ట్రాల్ పెరుగుతుంది,అవసరమా అనిపించేలా ఉండకూడదు…ఒకవేళ ఇలాంటి వంట చేసినా చేసిన వాళ్ళు తినరు,ఇంట్లో వాళ్ళతోనో,పక్కవాళ్ళ చేతనో తినిపిస్తారు..

తోచీతోచనమ్మ టీవీ వాళ్ళకు ఇచ్చే సలహా అనుకోండి,రిక్వెస్ట్ అనుకోండి,అది ఏమిటి అంటే వంటల ప్రోగ్రాములలో కొత్తవాళ్ళతో వంట చేయించాలి అంటే కొంచెం ముందే వంట చేసే వాళ్ళని ప్రిపేరు చేయించండి,ఒకసారి వాళ్ళతో ఆ వంట చేయించి ,మీరు ఓకే అనుకున్నాకే వాళ్ళని రంగంలోకి దింపండి.వీలైనంత వరకు,తక్కువ అయిటంస్ వాడి మంచి మంచి వంటలు ఎలా చేయొచ్చో చూపించండి,..నా నా హంగామా వంటలు, పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసి మా మీద వదలకండి …కొన్ని సార్లు మంచి వంటలు కూడా చూపిస్తున్నారు,మేము కూడా ప్రయత్నించాం,సఫలీకృతం అయ్యాం….అందుకు ధన్యవాదములు…మీరు మరెన్నో మంచి వంటలు మాకు నేర్పించాలని ఆశిస్తూ…సెలవు.




16, జూన్ 2015, మంగళవారం

ఓ తల్లి ఆవేదన


పార్వతమ్మ తన ఆవేదన పక్కింటావిడతో ఇలా చెప్పుకుంటుంటే విన్నాను,నిజమే కదా పాపం అనిపించింది.

బిడ్డలు కలగాలని కలలు కని,నవ మాసాలు మోసి,కని,అపురూపముగా పెంచి,చదువుసంధ్యలు చెప్పించి,చిన్న చీమ కుట్టినా మనసంతా విలవిలలాడిపోయి,కంటికి రెప్పలా కాచుకుని,వాళ్ళ పరీక్షలకు నేను నిద్ర కాచి,వాళ్ళ రిజల్టు కోసం నేను మొక్కులు మొక్కి,వాళ్ళు ఉన్నతస్థానం లో ఉండాలని కోరుకుంటూ,వాళ్ళకు నచ్చిన వాళ్ళతోనె వాళ్ళ పెళ్ళిళ్ళు చెసి,వాళ్ళకు పుట్టబోయే బిడ్డలతో ఆడుతూ పాడుతూ శేష జీవితం గడపాలనుకున్నాను వదినా..నా బిడ్డలు నన్ను ఒక యంత్రంగా చూస్తారని నేను అసలు వూహించలేదు.

నా కొడుకుకోడలు ఇద్దరూ వుద్యోగులైతే వారి జీవితం హాయిగా సాగుతుంది అనుకున్నాను కాని,నేను వాళ్ళకు పనిమనిషిని అవుతాను అనుకోలేదు.నా పిల్లలకు నేను చేసిపెట్టుకొవడం నాకు కష్టం కాదు కాని,నా కష్టాన్ని గుర్తించక,చిన్న పొరపాటు జరిగినా కొడుకుకోడలు ఇద్దరూ కసురుకోవడం,విసుక్కోవడం చూస్తే చాలా బాధగా ఉంది.వాళ్ళ పిల్లలపని,ఇంటిపని,వంటపని చేసి అలసట అనిపిస్తే కాస్త విశ్రాంతి తీసుకోమని అనడానికి కూడా వాళ్ళకు నోరు రావడం లేదు..వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళు ఆఫీసు నుండి వచ్చాక కాస్త కునుకు తీద్దాం అంటె ఒప్పుకోరు..ఆఫీసు నుండి అలసిపోయి వచ్చాము,కాస్త టీ ఇవ్వు,కాస్త స్నాక్స్ పెట్టు అని మొదలుపెదతారు..అది మొదలు రాత్రి భోజనాలు అయ్యేదాక నాకు ఇక తీరిక దొరకదు,మళ్ళీ రేపటికి యేం టిఫిను చేయాలి,యే కూరలు చేయాలి అనె టెన్సన్ తోనే నిద్రపోతాను..
యెప్పుడైనా యేదైనా కాస్త సుస్తీ చేస్తే,యెప్పుడూ యేదొ ఒక రోగం,నొప్పి అని యెడుస్తుంటావ్,లేచి తిరుగులాడు,అన్ని తగ్గిపోతాయ్ అంటారు.ఈ వయసులొ నొప్పులు,రోగాలు రాక,పసిప్రాయం తిరిగొస్తుందా వదినా...నన్ను వూరికి పంపించండి అంటె యెవరి కోసం చేస్తున్నావ్,ఇది నీ ఇళ్ళు కాదా,నీ సంసారం కాదా అని నిలదీస్తారు..జైలు జీవితం లా ఉంది నాకు ,పక్కింటి వాళ్ళతో మాట్లాడకూడదు,సీరియల్లు,టివి ప్రోగ్రాములు చూడకూడదు,వాళ్ళ పిల్లలకు చిన్న జలుబు,దగ్గు వచ్చినా నాకే తిట్లు....పెద్దదానివి ఆ మాత్రం తెలియదా,పిల్లలకు యేమి పెట్టాలో,యేవి పెట్టకూడదొ అని,నేను గొడ్డుదాన్ని,పిల్లలని పెంచనిదాన్ని అన్నట్లు మాట్లాడెవారు..వద్దు దేవుడా వీడి దగ్గర అని కొన్నాళ్ళు కూతురి దగ్గర ఉన్నాను..అక్కడా అదే తంతు....

అల్లుడు ప్రతి చిన్న విషయానికి నన్ను తప్పు పట్టడం,ఆ విషయంలో అమ్మాయికి అల్లుడికి గొడవలు కూడా వచ్చేవి..యెంత చదువూ సంస్కారం వున్నా ఒక్కొసారి ఇంత మూర్ఖులుంటారా అనిపించేది అళ్ళుడి తీరు..అతని ముందు కాస్త టివి చూడకూడదు,ఫక్కింటి వాళ్ళతో మాట్లాడకూడదు,నా అన్నదమ్ములకు యెప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడకూడదు..అమ్మాయితో పిల్లలతో సరదాగా మాట్లాడడం చూసినా ఒప్పుకోడు..పిల్లలకు మీ అమ్మ మొరటు మాటలు,మొరటు తిళ్ళు నేర్పిస్తుంది,తనకు దూరంగా ఉంచు అనేవాడు..అమ్మాయి నాతో చెప్పకపోయినా నాకు వినపడేలా అనేవాడు కాబట్టి వినిపించేది..తన తల్లికిచ్చిన గౌరవం నాకు ఇచ్చేవాడు కాదు,నేను కూడా తన తల్లి లాంటి దాన్నే కదా..అదేమిటొ మరి అతనికి అంత కినుక అత్తగారంటే..మేము మాత్రం అల్లుడికివ్వాల్సిన గౌరవం అల్లుడికిస్తాం,కాని వాళ్ళు అలా ప్రవర్తిస్తారు..కూతురు కూడా అల్లుడికే వత్తాసు..పాపం తను మాత్రం యేం చేస్తుంది..నేను కాదు కద తన జీవితం.తన భర్తే తన జీవితం...

ఇదంతా కాని పని అని,నేను మన వూరికి వచ్చేసాను..యెప్పుడైనా పిల్లలని చూడాలి అనిపిస్తే వెళ్ళి చూసొస్తాను,ముసలితనంలో కూడా కృష్ణా,రామా అనుకునె తీరిక లేని జీవితం,అది కూడా నా కష్టానికి విలువ ఇవ్వని మనుషుల మధ్య ఉండడం చాలా కష్టం వదినా....నన్ను తిట్టే వాళ్ళు,మొఖం ముడుచుకుని దెప్పిపొడుపు మాటలు అనేవాళ్ళు యెవరూ లేరు...నా జీవితం,నా కష్టం..సంతోషంగా బ్రతికేస్తాను... ఈ పిల్లలు మనల్ని అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళకు మన వయసు రావాలి,వాళ్ళ స్థానంలో వాళ్ళ పిల్లలుండాలి.అప్పుడు మనని గుర్తుకుచేసుకోక మానరు..


15, జూన్ 2015, సోమవారం

అంతా అబద్దం-ఒక్కటే నిజం

నాదినాది అన్నది నాది కాదు నీదినీది అన్నది నీది కాదు
నా-అన్నవాళ్ళు నావాళ్ళు కారు నీ-అన్నవాళ్ళు నీవాళ్ళు కారు
ఉన్నదీ లేనిదీ నాదీ నీదీ అంతా అబద్దం
ఒక్కటే నిజం అంతా మాయ..అంతా మాయ అన్నదొక్కటే నిజం..

శ్రీ రామ రక్ష సర్వజగద్రక్ష

శ్రీ రామ రక్ష సర్వజగద్రక్ష

స్నేహితులను కలిసి కష్టసుఖాలు పంచుకునే రోజులు అరుదు అయ్యాయి.లేఖలు వ్రాసినా అవి చదివే తీరిక ఓపిక అవతలి వాళ్ళకు ఉంటుందని అనుకునే వీలు లేదు..సంతోషం అయినా,బాధ అయినా కాగితం మీద అక్షర రూపం లో అలికేయడం నాకు అలవాటు..ఇప్పుడు కొత్తగా బ్లాగుగా వ్రాద్దాం అనిపించి బ్లాగు క్రియేట్ చేసాను.
ఈ బ్లాగులో నేను వ్రాసే యే విషయమైనా,అది ఇతరులను బాధ పెట్టడానికి కాదు.

అంతా నా సొంత గోలే...


ఇట్లు..
తోచీతోచనమ్మ..