4, మే 2020, సోమవారం

పెద్ద సారోల్ల ఒత్తిడి-చిన్న టీచర్లలో అలజడి


అయ్యా మహానుభావా!పెద్ద సారూ!!కాస్త మా బాధ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
మీరు దేశాన్ని,ఒక జాతివర్గాన్ని ఉద్దరించాలని చేసే ఉద్యమం మహాద్భుతం.అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి.దేశంలో మీరు మాత్రమే దేశోద్ధారకుడు కారు,చాలామంది వారివారి పరిధిలో దేశాన్ని ఉద్ధరించాలనే వారున్నారు.ఎవరికి తోచిన రీతిలొ వారు ఉద్ధరిస్తున్నారు,అందులో మేముకూడా ఉన్నాము.ఒకవేళ మీరొక్కరే దేశోద్ధరకులు,మాకెవరికీ దేశం ,ప్రజలు అనే స్పృహ ,చిత్తశుద్ధి లేదనుకుంటున్నారా?

ఉద్యోగాన్ని ఉద్యమంలా చేయాలనిపిస్తే చేసుకోండి,ఆ ఉద్యమంలో మీరొక సమిధ కావాలంటే అలాగే అవనీయండి.కాని మీ ఉద్యమానికి మందిని,మీక్రింది వారిని సమిధలు చేస్తా అంటే అది రాక్షస క్రీడే అవుతుంది.ఎంతసేపు మీరు చెప్పిందె జరగాలికాని,అవతలి వారి వైపు నుంచి ఆలోచించరా?సాధ్యాసాధ్యాలు చూసుకోరా?పిచ్చితుగ్లక్ పాలన,ఔరంగజేబు పాలన గుర్తొస్తుంది మీ పరిపాలనలో..క్షమించండి ,దయచేసి మా బాధ అర్థం చేసుకోండి.

మేము కూడా మీలాగే సమాజానికిఎంతో కొంత మేలు చేయాలని,మనసా వాచా కర్మణా మా ఉద్యోగ ధర్మాన్నినిర్వహించాలి అనె లక్ష్యంతో ఉన్నాం.మమ్మల్ని మీరు చెప్పిన ప్రతీది చేయలేక,మేము చేయాలనుకుంది చేయలేక రెంటికీ  చెడ్డ రేవడి లా మా జీవితాలని చేయొద్దు.ఒక్కనెల తరగతులు జరగకపోతె భవిష్యత్ అంతా ఎలా నస్టపోతారు సార్ నీ వర్గం పిల్లలు.వేరే కళాశాలలు,పాఠశాలల్లో కూడా తరగతులు జరగడం లేదు సార్,కుదిరిన వాళ్ళు చెప్పుకుంటున్నారు,కుదరని వాళ్ళు వచ్చే విద్యా సంవత్సరానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు.అంతే కాని ఎవరూ ఎమీ చేయకుండా జీతాలు తీసుకోవాలి అనుకోరు..ఒక్క నెల రెండు నెలలు తరగతులు జరగపోతే ఏం నష్టం రాదు సార్..

ఫిన్లాండ్ లాంటి దేశంలో సంవత్సరం విరామం ఇస్తారు విద్యార్థులకు..మీరెందుకు అంత వాపోతున్నారు సార్?పెద్దలు ,మీరు మీ ఆటిట్యూడ్ మార్చుకోకపోతె వదిలేయండి.కానీ దాన్ని మామీద రుద్దకండి.మాకు విద్య మీద,నిరుపేద పిల్లల చదువులమీద కొన్ని ఆదర్శాలున్నాయ్..వాటిని మీమూలంగా వదిలేసే పరిస్థితి మాకు రానివ్వకండి.

తల్లిదండ్రులకు పిల్లలకోసం స్మార్ట్ ఫోన్,ల్యాపుటాపు కొనే స్తొమత లేదు,ఒకవేళ వాళ్లు నానా తంటాలు పడి కొన్నా,స్మార్ట్ గా పని చేసి,ఆన్లైన్ తరగతులు,మీటింగ్ లు పెట్టుకునే నెట్వర్క్ పల్లెల్లో లేదు.
నెల రోజులు వాళ్ళకు నచ్చిన పని చేసుకోమని, తల్లితండ్రులతో ,బంధువులతో ఎలా మెలగాలో నేర్చుకోమని చెప్పండి సార్.ఎందుకంటె మీ హాస్టల్లొ అలవాటు పడిన పిల్లలకు అన్నం విలువ తెలియడం లేదు,గురువుల విలువ తెలియదు,పెద్దలతో ఎలా మెలగాలో తెలియదు,ఎమైనా అంటే మేము ఎవరికి తలవంచం,నమస్కారం పెట్టం,ఎందులోను రాజీ పడం అంటారు.

ఎన్ని చదువులున్నా వినయం లేకుంటే అంతా సున్న..పిల్లలను మనుషులుగా తీర్చిదిద్దాలి కాని అక్షరాలు తిని అక్షరాలు కక్కే యంత్రాలుగా కాదు...దానికి మాలాంటి ఉపాధ్యాయులని బలిపశువులని చేయకండి.

బతకలేక బడిపంతులు అనే పాత నానుడి మీ వలన మళ్ళీ ఋజువయింది.మా జీతాలతో జీవితాలతో  ఆడుకోకండి..ఆదర్శాలు,ఆశయాలు నెరవేరని యువత అడవిదారి పట్టిన తీరు తిరిగి తెరమీదకి రాకూడదని భగవంతుని కోరుకుంటూ...


ధన్యవాదములు..


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి